Rare Vulture | రాబందుల జాతి అంతరించిపోతున్నది. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట రాబందులు దర్శనమిస్తున్నాయి. వీటిని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతనమైనదని, అరుదైనదని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని వయసు వంద ఏండ్లకు పైబడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.
కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్‌లోని ఈద్గా స్మశానవాటికలో ఆదివారం సాయంత్రం అత్యంత అరుదైన రాబందు కనిపించింది. దీనిని అరుదైన హిమాలయన్ గ్రిఫాన్ రాబందుగా జంతుశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో తచ్చడటం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ రాబందును కొందరు పట్టుకుని బంధించి స్థానిక అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. తెలుపు రంగులో ఉండి చాలా పొడవాటి రెక్కలతో భయపెట్టేలా ఉన్న ఈ రాబందును చాలా మంది తమ ఫోన్లలో బంధించారు. దీని రెక్కలు దాదాపు 5 అడుగుల వరకు ఉన్నాయని అటవీ అధికారులు చెప్పారు.
#WATCH | UP: A rare vulture was captured in Eidgah cemetery of Kanpur's Colonelganj yesterday. The locals handed it over to Forest Dept.
A local says, "The vulture had been here for a week. We tried to catch it but didn't succeed. Finally, we captured it when it came down." pic.twitter.com/7t5QWXiN3h
— ANI (@ANI) January 9, 2023
హిమాలయన్ గ్రిఫాన్ రాబందు అనే ఈ పక్షి టిబెటన్ పీఠభూమిలోని హిమాలయాలలో 13 వేల అడుగుల ఎత్తులో జీవిస్తాయని, ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయని అధికారులు చెప్పారు. మన దేశంలో కనిపించే తొమ్మిది రాబందు జాతులలో నాలుగు ప్రమాదకరమైన జాతులను ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లోని అంతరించిపోతున్న జంతుజాతుల్లో చేర్చారు. భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) షెడ్యూల్-Iలో రాబందులను ప్రభుత్వం చేర్చింది. ఇది అంతమవడానికి దగ్గరగా ఉన్న జాతిగా ప్రభుత్వం గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం, వెటర్నరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ డైక్లోఫెనాక్ వాడకం వల్ల 1990ల నుంచి రాబందుల జనాభా 99 శాతానికి పైగా పడిపోయింది.