అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు గురువారం రాజ్‌కోట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. గుజరాత్లో కాషాయ పార్టీని ఓడించేందుకు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆప్ మేలైన వేదికగా ముందుకొచ్చిందని ఇంద్రనీల్ అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కోసం కాకుండా ప్రజల బాగు కోసం పాటుపడతారని ఆప్ చీఫ్‌పై ప్రశంసలు గుప్పించారు. ప్రజలను మభ్యపెట్టి బీజేపీ అధికారంలోకి రాగా దీటైన ప్రత్యామ్నాయంగా ఎదగడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. బీజేపీని ఓడించాలనే సంకల్పం కాంగ్రెస్ పార్టీకి కొరవడటంతోనే తాను ఆప్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
ఇంద్రనీల్ రాజ్‌గురు 2012లో రాజ్‌కోట్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2017లో సీఎం విజయ్ రూపానీపై పోటీ చేసేందుకు ఆయన తన సురక్షిత నియోజకవర్గాన్ని విడిచి రాజ్‌కోట్ వెస్ట్‌లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇంద్రనీల్ రాజ్‌గురు రాకతో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బలోపేతమవుతుందని ఆప్ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది.