European Airlines | న్యూఢిల్లీ: పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా పశ్చిమ దేశాలకు ప్రయాణించేందుకు దూరం పెరిగి ఖర్చులు ఎక్కువై నష్టపోతున్నది కేవలం ఇండియన్ ఎయిర్‌లైన్స్ మాత్రమే కాదు..అనేక దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు కూడా. తమపై నిషేధం లేనప్పటికీ అవి పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా దూరం పెట్టడం గమనార్హం. చివరకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నామనుకుని భ్రమపడి పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది. తన గగనతలాన్ని ఉపయోగించుకున్నందుకు ఎయిర్‌లైన్స్‌ల నుంచి ఓవర్‌ఫ్లైట్ ఫీజుల పేరిట ప్రతి నెలా లక్షల డాలర్లు వసూలు చేస్తున్న పాకిస్థాన్ ఏరోస్పేస్ సంస్థ ఇప్పుడా ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
గత రెండు రోజులుగా లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ఐటీఏ, పోలాండ్ లాట్ వంటి ప్రముఖ యూరోపియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు స్వచ్ఛందంగా పాకిస్థాన్ గగనతలాన్ని వాడుకోవడం మానేశాయి. భారత్, పాక్ మధ్య తాజాగా తలెత్తిన ఉద్రిక్తతలే ఇందుకు కారణమని తెలుస్తోంది. యూరోపియన్ విమాన సంస్థలు పాక్ గగనతలాన్ని దూరం పెట్టడం వల్ల యూరప్, భారత్ మధ్య విమాన ప్రయాణం సగటున దాదాపు గంట ఎక్కువ పడుతుంది. పర్యవసానంగా పెరిగిన ఇంధన ఖర్చుల భారం ప్రయాణికులపైనే వేయకతప్పదు. అయితే ఆ భారం ఎప్పటి నుంచి మొదలవుతుందో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్థాన్ పౌర విమాన సంస్థ ఏటా ఓవర్‌ఫ్లైట్ చార్జీల కారణంగా ఏటా వందల కోట్ల రూపాయలు నష్టపోనున్నది.