న్యూఢిల్లీ : గతవారం రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వైరస్ మళ్లీ ప్రతాపం చూపుతోందని స్పష్టమవుతున్నది. వరుసగా నాలుగు రోజుల పాటు రోజువారీ ఇన్ఫెక్షన్లు 7వేలకుపైగానే నమోదయ్యాయి. శుక్రవారం 7,500 కేసులు రికార్డవగా.. అయితే, ఈ సంఖ్య గత 24 గంటల్లో 8,329కి చేరింది. వరుసగా కేసులు పెరుగుతూ వస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో అందరిలో మరో వేవ్ తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇదిలా ఉండగా.. దేశంలో గత కొద్ది రోజులుగా ముంబైలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
గడిచిన వారం రోజుల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో సైతం కేసులు పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో నిన్న 655 కొవిడ్ కేసులు రికార్డవగా.. ఇటీవల ఇంత ఎక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వైరస్ మళ్లీ విస్తరిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో నిపుణులు తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ముప్పును దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.
కొవిడ్-19 గణాంకాలను పరిశీలిసే.. దేశంలో జనవరిలో కరోనా థర్డ్ వేవ్ అనంతరం మళ్లీ కేసులు ఇంత వేగంగంగా పెరగడం ఇదే తొలిసారి. 103 రోజుల్లో తొలిసారిగా రోజువారీ కేసులు 8వేల మార్క్‌ను దాటాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం మహారాష్ట్ర, కేరళ నుంచే రికార్డవుతున్నాయి. మే తర్వాత ఢిల్లీలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీలో రోజువారీ పరీక్ష పాజిటివిటీ రేటు (TPR) 2.3శాతానికి చేరింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అత్యధికం.
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, ప్రపంచ స్థాయిలో స్వల్ప తగ్గుదల ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీక్లీ రిపోర్ట్ మేరకు.. మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా మినహా ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గింది. కేసులు 12 శాతం నుంచి 30 లక్షలకు తగ్గాయి. అయితే ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన కేసులు 22 శాతం తగ్గి 7,600కి చేరాయి.
భారతదేశంలో పెరుగుతున్న కేసుల పెరుగుదల నేపథ్యంలో ఫోర్త్ వేవ్ తప్పదా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే, ఈ విషయంపై ఐసీఎంఆర్ ఏడీజీ సమీర్ పాండా మాట్లాడారు. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని నాల్గో వేవ్ అని ఇంత త్వరగా చెప్పడం సరికాదన్నారు. జిల్లా స్థాయిలో డేటాను పరిశీలించాలని, కొన్ని జిల్లాల్లో కేసుల పెరుగుదలను జాతీయ స్థాయిగా పరిగణించలేమన్నారు. కరోనా ప్రతి రూపాంతం ఆందోళన కలిగించదని, అయితే, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం అలాంటి ఊహాగానాలు చేయలేమన్నారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రయత్నాలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. మహమ్మారి పరిస్థితిని నియంత్రించేందుకు కృషి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలో కోరారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా వ్యక్తిగతం వైరస్ వ్యాప్తి చెందకుండా, నివారణకు చర్యలు తీసుకుంటూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మాస్క్ ధరించడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని నిపుణులు స్పష్టం చేశారు.