జైపూర్: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్ పేపర్ లీక్‌ను ఒక కెమిస్ట్రీ టీచర్ గుర్తించారు. (NEET Leak) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని సికర్‌కు చెందిన రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కేరళంలో ఉంటున్న ఆ ఇంటి యజమాని కుమారుడు నీట్ టెస్ట్ జరిగిన మే 3న ఒక గెస్ పేపర్‌ను తన తండ్రికి వాట్సాప్‌లో పంపాడు. నీట్ పేపర్ లీక్ ప్రచారం నేపథ్యంలో దానిని పరిశీలించాలని కెమిస్ట్రీ టీచర్‌ను ఆ ఇంటి యజమాని కోరాడు.
కాగా, చేతి రాతతో ఉన్న నీట్ గెస్ పేపర్‌ను పరిశీలించిన కెమిస్ట్రీ టీచర్ షాక్ అయ్యారు. వైరల్ అయిన గెస్ పేపర్‌ను అసలు ప్రశ్నాపత్రంతో ఆయన సరిపోల్చారు. అందులోని 45 కెమిస్ట్రీ ప్రశ్నలు అసలు నీట్ టెస్ట్ ప్రశ్నల్లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సహోద్యోగి అయిన బయోలజీ టీచర్‌కు ఆ గెస్ పేపర్‌ను చూపించారు. బయోలజీ విభాగంలోని 90 ప్రశ్నలు కూడా అసలు పరీక్షలోని ప్రశ్నలతో సరిపోలినట్లు తేలింది. గెస్ పేపర్లోని ప్రశ్నలు, నీట్ టెస్ట్ పేపర్లోని ప్రశ్నలతో పోల్చి చూడగా మొత్తం 720 మార్కులకు గాను 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి.
దీంతో నీట్ పేపర్ లీక్ గురించి ఆ ఇద్దరు టీచర్లకు అనుమానంతో పాటు ఆందోళన కలిగాయి. సలహా కోసం ఇతర సహోద్యాయులను కూడా వారు సంప్రదించారు. ఈ నేపథ్యంలో మే 4న తెల్లవారుజామన 1.30 గంటల సమయంలో సికర్‌లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు కెమిస్ట్రీ టీచర్ వెళ్లారు. నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం ఇచ్చారు. అయితే తగిన ఆధారాలతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీస్ అధికారి సూచించారు.
ఈ నేపథ్యంలో నీట్ టెస్ట్ పేపర్ స్క్రీన్షాట్లు, సోషల్ మీడియాలో వైరల్ అయిన గెస్ పేపర్, ఇతర ఆధారాలను ఆ కెమిస్ట్రీ టీచర్ సేకరించారు. నీట్ లీక్‌పై ఫిర్యాదు కోసం ఇంటి యజమాని కూడా ఆయనను ప్రోత్సహించారు. దీంతో మే 6న తగిన ఆధారాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ఈమెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు.

Neet Leak Whistleblower
మరోవైపు కొన్ని గంటల్లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ (డీజీ) అభిషేక్ సింగ్, సీబీఐ అధికారుల నుంచి ఆ కెమిస్ట్రీ టీచర్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి. మే 7న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఒక బృందం సికర్‌కు చేరుకున్నది. ఆ టీచర్ స్టేట్మెంట్ను వారు రికార్డ్ చేశారు. వైరల్ అయిన నీట్ లీకేజీకి సంబంధించిన సమాచారం, ఆధారాలను ఆయన నుంచి సేకరించారు. అదే రోజున రాజస్థాన్ ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్’ పోలీసులు కూడా ఆ టీచర్‌ను విచారించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ అయ్యిందని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు మే 11న ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజీపై దర్యాప్తును సీబీఐకి కేంద్ర విద్యాశాఖ అప్పగించింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
కాగా, నీట్ ‘గెస్ పేపర్’ను రూ.30,000 నుంచి రూ.30 లక్షల వరకు విద్యార్థులు, నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. మే 3న జరిగిన నీట్ పరీక్షకు రెండు వారాల కంటే ముందే ఈ ‘గెస్ పేపర్’ సర్క్యూలేట్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. గెస్ పేపర్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి రూ.15 లక్షలకు విక్రయించిన మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభమ్ ఖైర్నార్‌ను మే 12న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
అలాగే గురుగ్రామ్‌లోని ఒక వైద్యుడి నుంచి సుమారు రూ. 30 లక్షలకు గెస్ పేపర్ కొనుగోలు చేసిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సోదరైన మంగీలాల్, దినేష్ బివాల్‌తో పాటు గురుగ్రామ్‌కు చెందిన యష్ యాదవ్‌ను కూడా అదే రోజున అరెస్ట్ చేశారు. పలు నగరాలకు చెందిన మరికొందరు అనుమానితులను కూడా నీట్ పేపర్ లీక్ గురించి సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు నీట్ పేపర్ లీక్‌పై గతంలో కూడా పలుసార్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఒక కెమిస్ట్రీ టీచర్ ఆధారాలతో సహా నీట్ పేపర్ లీక్‌ను వెలుగులోకి తీసుకురావడంతో ఆ పరీక్షను తొలిసారి ఎన్డీఏ రద్దు చేయడం విశేషం. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ పేపర్ లీక్‌ను బయటపెట్టినట్లు విజిల్ బ్లోయర్ అయిన ఆ కెమిస్ట్రీ టీచర్ మీడియాకు వెల్లడించారు.