Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 13: బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులే న్యాయమూర్తులుగా మారి ఇండ్లు కూల్చేయడం లాంటి శిక్ష విధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. బుల్డోజర్తో ఇంటిని కూల్చేసి మహిళలు, చిన్నారులు, వృద్ధులను రాత్రికి రాత్రి నిరాశ్రయులు చేసే దృశ్యం భయంకరమైనదని అభివర్ణించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు కూల్చడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై అనుసరించాల్సిన ప్రక్రియపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అధికారాలను వినియోగించి రాష్ర్టాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. పలు రాష్ర్టాల్లో అవలంబిస్తున్న బుల్డోజర్ న్యాయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం బుధవారం 95 పేజీల కీలక తీర్పు వెలువరించింది.
పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇండ్లను అధికారులు కూల్చేయడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘అధికారే న్యాయమూర్తులుగా మారి ఓ వ్యక్తిని దోషిగా నిర్ణయించి, అతడి ఆస్తులను కూల్చడం ద్వారా శిక్ష విధించడం కుదరదు. ఇలా చేయడం అధికారి తన పరిమితులను దాటడంతో పాటు అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది’ అని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ దాని ప్రధాన విధులు నిర్వర్తించకుండా కార్యనిర్వాహక వ్యవస్థ భర్తీ చేయలేదని వ్యాఖ్యానించింది. సహజ న్యాయానికి సంబంధించి కనీస సూత్రాలు పాటించకుండా, సరైన ప్రక్రియను అవలంబించకుండా నిర్మాణాన్ని కూల్చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నది. అధికారం ఉంది కదా అనే భావనతో ఇష్టారీతిన వ్యవహరించే తీరును ఇది గుర్తు చేస్తున్నదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఇలాంటి ఏకపక్ష, అతిగా అధికారాన్ని ఉపయోగించే చర్యలకు చోటు లేదని స్పష్టం చేసింది.
ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా లేదా దోషిగా ఉన్నందుకు ఆ వ్యక్తి నివసించే ఇంటిని కూల్చేయడం అంటే ఆ ఇంట్లో నివసించే మొత్తం కుటుంబానికి శిక్ష విధించడమే అని కోర్టు పేర్కొన్నది. ఇది అరాచకమని, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించడమే అని స్పష్టం చేసింది. ఇల్లు ఉండటం ఏ వ్యక్తికైనా సంతృప్తిని ఇస్తుందని, గౌరవాన్ని, నాది అనే భావనను కలిగిస్తుందని, భవిష్యత్తు, భద్రతపై ఆశను కల్పిస్తుందని జస్టిస్ గవాయి అన్నారు. సగటు పౌరుడికి ఇంటి నిర్మాణం అనేది ఏండ్ల తరబడి పడ్డ శ్రమ, కల, ఆకాంక్షలకు పరాకాష్ట అని, దానిని తొలగించాలంటే అధికారులు కచ్చితంగా వేరే మార్గం లేదని సంతృప్తి చెందాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందీ కవి ప్రదీప్ రాసిన కవిత్వాన్ని ప్రస్తావించారు.
బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు పెద్ద ఆదేశాన్ని ఇచ్చింది. ఇది బుల్డోజర్ చర్యలను నిలిపేస్తుంది. బుల్డోజర్ను సుప్రీంకోర్టు ఎప్పటికీ గ్యారేజ్లోనే ఉండేలా పార్క్ చేసేసింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. బుల్డోజర్ యాక్షన్ పేరుతో రాష్ట్రంలో పేదల ఇండ్లను కూల్చేశారని, అయోధ్యలో బీజేపీ ఓటమికి కూడా ఇదే కారణమని పేర్కొన్నారు.