న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మంది బాధితులకు న్యాయం కోసం ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) కోడ్ నేమ్‌తో సైనిక చర్యను భారత్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని కీలకమైన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్‌తోపాటు పీవోకేలో క్రమపద్ధతిలో నిర్మించిన, అధునాతన ఉగ్రవాద మౌలిక సదుపాయాల లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ చేపట్టింది. రిక్రూట్మెంట్, ఇండోక్ట్రినేషన్ కేంద్రాలు, ఆయుధ శిక్షణా సౌకర్యాలు, లాంచ్ ప్యాడ్లు, ఆపరేషనల్ స్థావరాలు వంటి వాటిని ధ్వంసం చేసింది.
కాగా, ఆపరేషన్ సిందూర్ కోసం 9 ఉగ్రవాద లక్ష్యాల ఎంపికలో భారత దళాలు కీలకంగా వ్యవహరించాయి. విశ్వసనీయ, నిఘా సమాచారం ఆధారంగా ఈ ఉగ్ర శిబిరాల ఎంపిక జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడితోపాటు భారత్‌కు వ్యతిరేకంగా గతంలో జరిగిన ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ లక్ష్యాలతో నేరుగా ప్రమేయం ఉన్నదని నిర్ధారణ కావడంతో వాటిని ఎంచుకున్నట్లు చెప్పారు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్‌లో లక్ష్యంగా చేసుకున్న ప్రతి ఉగ్రవాద శిబిరం భారత్‌లో జరిగిన నిర్దిష్ట దాడులతో ముడిపడి ఉన్నదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా, జైషే-ఏ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపుల కేడర్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందాయని చెప్పారు. అందుకే కేవలం ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలనే టార్గెట్ చేసి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. దీంతో ‘ఆపరేషన్ సిందూర్’ విజయంలో ఉగ్రవాదులు మాత్రమే మరణించారని పౌరులకు ఎలాంటి హాని జరుగలేదని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.