Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 27: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులలో నేర నిరూపణ శాతం తక్కువగా ఉండటం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మీరు నమోదు చేసిన కేసులలో నేర నిరూపణ శాతం ఎంత? ఒక వేళ 60-70 శాతం ఉంటే మేము అర్థం చేసుకునేవాళ్లం. కానీ అది చాలా దయనీయంగా ఉంది’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భుయన్ వ్యాఖ్యానించారు.
బెంగాల్లో టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు పార్థ చటర్జీపై కేసు నమోదైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎలాంటి విచారణ జరపకుండా దీర్ఘకాలం పాటు నిందితులను కస్టడీలో ఉంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఒక వ్యక్తిని చిరకాలం కస్టడీలో ఉంచిన తర్వాత చివరకు అతను నిర్దోషి అని తేలితే ఏం జరుగుతుంది? 2.5 నుంచి 3 ఏండ్ల కస్టడీలో ఉండటమంటే తక్కువ కాలం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది.