Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్ సంస్కృతిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడువక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమీరాయి. సీఎం సీట్లో రెండో కృష్ణుడ్ని కూర్చబెట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమి జరిగిందో తెలిసినప్పటికీ.. మారకపోతుందా అని నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కడితే.. మళ్లీ పాత కల్చరే పునరావృతం కావడం పట్ల ప్రజలు ఈసడించుకుంటున్నారు. కర్ణాటక పరిస్థితి ఇలా ఉంటే, తాము కర్ణాటక మాదిరిగా తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ప్రచారం చేయడం పట్ల ఇక్కడి ప్రజలు విస్తుపోతున్నారు. కాంగ్రెస్కు పట్టం కడితే అక్కడ ఏమి జరుగుతుందో తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాదన్న గ్యారెంటీ ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్యను గద్దెదింపడానికే స్వయంగా ఆయన మంత్రివర్గ సహచరులే పావులు కదపడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
సీఎం సిద్ధరామయ్యను గద్దె దింపేందుకు మంత్రి సతీశ్ జార్ఖిహోలి నేతృత్వంలో 20 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటుచేసినట్టు సమాచారం బయటికి పొక్కడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హుటాహూటిగా బెంగళూరుకు చేరుకొని మంత్రి జార్ఖిహోళితో చర్చలు జరిపినట్టు ఈ వర్గాల సమాచారం. పక్క రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అక్కడ పార్టీ పరువు పోతుందని నచ్చజెప్పినట్టు తెలిసింది.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను లోక్సభ ఎన్నికల వరకే కొనసాగించి ఆ తర్వాత మార్చుతామని కాంగ్రెస్ అధిష్ఠానం హింట్ ఇవ్వడమే క్యాంప్ రాజకీయాలకు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో పార్టీ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటాపోటీగా కృషి చేశారు. వీరిలో సీఎం పోస్టు ఎవరికి ఇవ్వాలన్న సంశయం ఏర్పడినప్పుడు చెరో రెండున్నర ఏండ్లు సీఎం పదవిలో కొనసాగేలా రాజీ ఫార్ములాను అధిష్ఠానం కుదిర్చినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య స్థానంలో రెండో కృష్ణుడు డీకే శివకుమార్ గద్దె నెక్కుతారన్న సమాచారంతో కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా రెండు గ్రూపులుగా విడిపోయింది. దీంతో అప్రమత్తం అయిన సిద్ధరామయ్య తన సన్నిహిత మంత్రులతో పూర్తి కాలం సీఎంగా సిద్ధరామయ్యనే కొనసాగుతారనే ప్రకటనలు కూడా చేయించారు. దక్షిణాదిలో ఏకైక రాష్ట్రం కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకేతోనే కాంగ్రెస్ పెద్దలు టచ్లో ఉండటం వల్ల కాబోయే సీఎం డీకేనే అన్న ప్రచారం జరుగుతున్నది. ఇది పార్టీలో అటు సిద్ధరామయ్య, ఇటు డీకే వర్గాలకు దూరంగా ఉండే మరో వర్గం తాము ఎందుకు సీఎం కావద్దనే ఆలోచనలతో క్యాంప్ రాజకీయాలు మొదలెట్టినట్టు చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పర్యటనకు ఇద్దరు మంత్రులు దూరంగా ఉండడం ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇటీవల బెళగావి జిల్లా పర్యటనకు వెళ్లిన డీకే శివకుమార్ కార్యక్రమానికి మంత్రులు సతీశ్ జార్ఖిహోలి, లక్ష్మీ హెబ్బాళ్కర్ దూరంగా ఉన్నారు. వీరిద్దరూ సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులుగా ముద్ర పడ్డారు. పార్టీలో కొందరు ఎమ్మెల్యేలను కొందరు వ్యక్తులు ప్రలోభ పెట్టి తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని డీకే శివకుమార్ ఈ సందర్భంగా ఆరోపించారు. సీఎంగా సిద్ధరామయ్యను గద్దె దింపడానికి డీకేనే కుట్రలు పన్నుతూ మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నట్టు ఆయనే ప్రచారం చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం సీట్లో సిద్ధరామయ్యనే కొనసాగేది కొద్దికాలమేనని డీకే వర్గం ప్రచారం చేస్తుండగా, పూర్తి కాలం కొనసాగుతారని సిద్ధరామయ్య వర్గం కౌంటర్ ఇస్తున్నది. తాజాగా తానెందుకు సీఎం కావద్దనే ఆలోచనతో ఎమ్మెల్యేలతో జార్ఖిహోళి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టినట్టు సమాచారం.