న్యూఢిల్లీ : ఒకప్పుడు దేశంలో నైరుతి రుతు పవనాలను ఆనందంగా స్వాగతించేవారు. ఇప్పుడు రుతు పవనాల రాకను ఒక రకమైన ఆందోళనతో గమనిస్తున్నారు. ఆలస్యంగా లేదా బలహీనంగా వచ్చే రుతు పవనాలు రైతులను మాత్రమే కాదు ఆహార ధరలు, విద్యుత్తు బిల్లులు, ఆదాయాలు, ద్రవ్యోల్బణం చివరికి రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో తద్వారా ఏర్పడే పరిణామాలు ఆర్థిక పరమైన సవాళ్లుగా మారవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు ఇప్పటికే పంటలు, పవర్ గ్రిడ్లపై ప్రభావాన్ని చూపాయి. ఎల్ నినో కారణంగా వేల కిలో మీటర్ల దూరంలోని మహా సముద్ర వేడెక్కితే అది సామాన్యుల ఇంటి బడ్జెట్ కూడా ప్రభావం చూపనుంది.
ఎల్‌నినో ప్రభావం కారణంగా భారతదేశంలో బలహీనమైన రుతు పవనాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా నైరుతి రుతు పవనాలు దక్షిణ మహారాష్ట్ర మీదుగా నిలిచిపోవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతంలో తీవ్ర లోటు ఏర్పడింది. వ్యవసాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్, తమిళనాడు సహా 12 రాష్ర్టాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ‘బీఎన్సీ పారిబాస్’ ప్రకారం తగ్గుతున్న ముడి చమురు ధరలు మొత్తం ద్రవ్యోల్బణ పరిస్థితిని మెరుగుపరిచాయి. అయితే వాతావరణ సంబంధిత అంతరాయాలు పెను ముప్పుగా మారబోతున్నాయి. ఇది వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ధరలపై ఆందోళనలను పెంచనున్నదని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2027 ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.1శాతానికి పెంచింది. కూరగాయలు, పండ్లు, వంట నూనెలు ఇప్పటికే ప్రియమయ్యాయి. వడగాడ్పుల కారణంగా దిగుబడులు తగ్గి టమోటోలు, పచ్చి మిర్చి, క్యాబేజీ ధరలు ఇప్పటికే పెరిగాయి. ద్రవ్యోల్బణ ప్రభావంతో ఉల్లిపాయలు, బంగాళా దుంపల ధరలపై ఒత్తిడి ఏర్పడనున్నది. ఇది సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నది.
దేశంలోని సాగుభూమిలో దాదాపు సగభాగం వర్షపాతంపైననే ఆధారపడి ఉంది. బలహీనమైన రుతు పవనాల కారణంగా పంటల దిగుబడి మరింత దిగజారనుంది. తక్కువ వర్షాలు నేలలోని తేమను తగ్గించి, విత్తనాలు చల్లడాన్ని ఆలస్యం చేస్తాయి. ఫలితంగా వరి, పప్పు ధాన్యాలు, పత్తి, చెరుకు తదితర కీలక ఖరీఫ్ పంటలు ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు భూగర్భ జలాలపై ఆధార పడినప్పుడు విద్యుత్, డీజిల్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ‘360 వన్ క్యాపిటల్ రీసెర్చ్’ తెలిపిన వివరాల ప్రకారం రుతు పవనాల ఆలస్యం ఇప్పటికే ఖరీఫ్ విత్తనాలపై ప్రభావం చూపిస్తోంది. జూన్ 12 నాటికి దేశ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 84.6 లక్షల హెకార్టర్లలో పంటలు సాగవుతున్నాయి. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే ఇది 3.9 శాతం తక్కువ.