Election Commission | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గత వారం నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో శరద్ పవార్ సారధ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లకు గల జాతీయ హోదా తొలగించింది. ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్, కేటాయింపు) ఆదేశాలు-1968 ప్రకారం వివిధ పార్టీలకు రాష్ట్ర హోదా, జాతీయ హోదాపై ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుంది.
2014, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2014 నుంచి 21 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇటీవల జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర పార్టీల హోదాలను ఈసీ సవరించింది. 2012 నవంబర్‌లో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గోవాల్లో పట్టు సంపాదించగా, గుజరాత్లో రాష్ట్ర పార్టీ హోదాతో జాతీయ హోదా పొందింది.
రాష్ట్ర హోదా గల పార్టీ.. ఏ రాష్ట్రంలోనైనా పోటీచేసే అభ్యర్థులకు రిజర్వుడ్ చిహ్నాం కేటాయిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. జాతీయ హోదా గల పార్టీకి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో రిజర్వుడ్ చిహ్నం కేటాయిస్తుంది. జాతీయ పార్టీ లేదా రాష్ట్ర హోదా గల పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి ఒక వ్యక్తి ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపులేని పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది.
రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతానికంటే ఎక్కువ పోల్ కావాలి. కనీసం ఇద్దరు ఎన్నికవ్వాలి. మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో మూడు శాతం మంది ప్రాతినిధ్యం కలిగి ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోవంతు సభ్యుల ప్రాతినిధ్యం కలిగి ఉండాలి.
ఏదైనా ఒక పార్టీ నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పని చేస్తూ ఉండాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం కంటే ఎక్కువ ఓట్లు పోల్ కావాలి. లోక్‌సభకు ఏదైనా ఒక రాష్ట్రం నుంచి గానీ, అంత కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి గానీ నలుగురు సభ్యుల ప్రాతినిధ్యం ఉండాలి. మొత్తం లోక్‌సభ స్థానాల్లో కనీసం రెండు శాతం సీట్లు గెలుచుకోవాలి. నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.
జాతీయ హోదా గల పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు చిహ్నం రిజర్వు చేయడంతోపాటు టెలివిజన్, రేడియోల్లో వారు మరింత ప్రచారం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా అభ్యర్థులను బరిలో నిలపవచ్చు. జాతీయ పార్టీకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. వారి ప్రచార ఖర్చు పార్టీ ఎన్నికల ఖర్చులోకి రాదు. రిజిస్టర్డ్ – గుర్తింపు లేని పార్టీ గరిష్టంగా 20 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించుకోవచ్చు. జాతీయ హోదా గల పార్టీకి ప్రధాన కేంద్రంలో పార్టీ కార్యాలయానికి స్థలం పొందొచ్చు.
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు ఐదు స్థానాల్లో గెలుపొందడంతోపాటు 12.92 శాతం ఓటింగ్ పొందింది. అప్పటికే ఢిల్లీ, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా కలిగి ఉన్న ఆప్‌కు, గుజరాత్ ఎన్నికల్లో ఓటు శాతంతో జాతీయ హోదా లభించింది.
2017,2018ల్లో జరిగిన గోవా, మణిపూర్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ.. రాష్ట్ర పార్టీ హోదా కోల్పోయింది. గోవాలో 2.28 శాతం, మణిపూర్‌లో 0.95 శాతం, మేఘాలయలో 1.61 శాతం ఓటు మాత్రమే పొందింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 16.71 శాతం ఓటు శాతంతో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో నాగాలాండ్‌లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో పోటీ చేయలేదు. పశ్చిమ బెంగాల్లో 43.28 శాతం, త్రిపురలో 0.40 శాతం ఓటింగ్ మాత్రమే పొందింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 48.02 శాతం ఓట్లు పొందిన తృణమూల్.. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2016-18 మధ్య పశ్చిమ బెంగాల్లో తృణమూల్ 44.91శాతం, మణిపూర్‌లో 1.41 , త్రిపురలో 0.30 శాతం ఓటింగ్ పొందింది. 2022 మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేలయేదు. దీంతో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్ర హోదాను కోల్పోవడంతోపాటు జాతీయ హోదాను ఈసీ ఉపసంహరించింది.
ఇక కేరళ, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా కలిగి ఉన్న సీపీఐ.. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో రాష్ట్ర పార్టీ హోదా, తద్వారా జాతీయ హోదాను కోల్పోయింది.