అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ రోడ్లపై మాంసం విక్రయశాలలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఖాళీ చేయించటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు వారిష్టమున్నది తినటాన్ని ఎలా అడ్డుకొంటారని ప్రశ్నించింది. ఏఎంసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాదాపు 20 మంది వీధి వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్.. ఏఎంసీ చర్యలను తప్పుబట్టారు. ‘అసలు మీ సమస్యేంటి? ఇంటి బయట నేను ఏది తినాలన్నది మీరు ఎలా నిర్ణయిస్తారు? ప్రజలు వారిష్టమున్నది తినటాన్ని మీరు ఎలా అడ్డుకొంటారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాంసం విక్రయాలను ఆపే ఉద్దేశం కాదని చెప్పబోగా, ఏఎంసీ చర్యల్లో దురుద్దేశాలు కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.