శ్రీనగర్: ఉత్తరాఖండ్‌లో కుంగుతున్న జోషిమఠ్ వంటి పరిస్థితులు తాజాగా జమ్ముకశ్మీర్‌లో నెలకొన్నాయి. దోడా జిల్లాలో పలు ఇళ్లు పగుళ్లిచ్చాయి. థాత్రి పట్టణంలోని బస్తీ ప్రాంతంలో ఏడు ఇళ్ల గోడలు, ఫోర్ల్ పగుళ్లిచ్చాయి. దీంతో నివాసితులు భయాందోళనతో ఆ ఇళ్లను ఖాళీ చేశారు. కొందరు పొరుగిళ్లల్లోకి, మరికొందరు బంధువుల ఇళ్లలోకి మారారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుకుంటున్నారు.
కాగా, ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ వేగంగా కుంగుతున్నది. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది జవవరి 8 మధ్య 12 రోజుల్లో సుమారు 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగింది. ఇస్రో శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌లో నివసిస్తున్న169 కుటుంబాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అలాగే బాగా పగుళ్లిచ్చిన ఇండ్లు, భవనాలను కూల్చివేస్తున్నారు.