Bangalore | బెంగళూరు, ఏప్రిల్ 4: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగిపోయాయి. ఏడాదిలోనే రెండు రెట్లు పెంచేశారు ఇంటి యాజమానులు. దీంతో ఐటీ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత కిరాయి పెరిగినా తప్పక భరిద్దామనుకునే వారికి ఓనర్లు పెడుతున్న కండీషన్లు మరింత చికాకు పెడుతున్నాయి. ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి అయ్యే కిరాయిని అడ్వాన్సు రూపంలో చెల్లించమని షరతు విధిస్తున్నారు. అంతేకాదు, ఇల్లు కిరాయికి ఇచ్చేముందు జూమ్, ఫేస్టుఫేస్ ఇంటర్వ్యూలు పెడుతున్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైళ్లు అడిగి వారి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా సులువుగా సాధించిన మేము ఇంటి ఓనర్ల ఇంటర్వ్యూలకు మాత్రం కష్టపడాల్సి వస్తున్నదని వాపోతున్నారు ఐటీ ఉద్యోగులు.
పలు ఐటీ సంస్థలకు బెంగళూరు నెలవుగా ఉంది. వీటిల్లో దాదాపు 15 లక్షల మంది పని చేస్తారని అంచనా. గతంలోనూ ఇతర నగరాలతో పోల్చుకుంటే బెంగళూరులో ఇండ్ల కిరాయిలు ఎక్కువగానే ఉండేవి. అయితే, కరోనా కారణంగా ఐటీ ఉద్యోగులు చాలా మంది బెంగళూరును వీడి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో బెంగళూరులో కిరాయిలు భారీగా తగ్గిపోయాయి. చాలా ఇండ్లు, ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలు క్రమంగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. దీంతో మళ్లీ ఉద్యోగులంతా బెంగళూరు వెళ్తున్నారు. దీంతో ఓనర్లు ఒక్కసారిగా కిరాయిలు పెంచేశారు. కరోనా సమయంలో వచ్చిన నష్టాలను కూడా ఇప్పుడు కిరాయిలు పెంచి భర్తీ చేసుకునే పనిలో పడ్డారు. దీంతో డబుల్ బెడ్రూం ఇంటి కిరాయి రూ.50 వేలకు చేరింది. కరోనా కారణంగా బెంగళూరులో నిర్మాణాలు ఆగిపోవడం కూడా కిరాయి పెరగడానికి ఒక కారణం.