న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. వారిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించుకున్నారు. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇస్లామాబాద్‌లో పాక్ ఆధ్వర్యంలో జరిగిన మధ్యవర్తిత్వ చర్చలు విఫలం అయిన తర్వాత వీరిద్దరూ ఫోన్లో సంభాషించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని ఎక్స్‌లో పంచుకున్నారు. ‘నా మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో మా ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేము సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు.