Honeymoon Murder : హనీమూన్ హత్య కేసు (Honeymoon Murder case) లో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ (Sonam Raghuvamshi).. సోహ్రా సబ్ డివిజన్ (Sohra sub-division) లోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ (Bail petition) దాఖలు చేసింది. కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ (Charge sheet) లో లోపాలున్నాయని తన పిటిషన్లో సోనమ్ పేర్కొంది.
సోనమ్ పిటిషన్‌పై ఈ నెల 17 విచారణ జరుపనున్నట్లు కోర్టు తెలిపింది. కేసు రికార్డులను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో కోర్టు విచారణను 17వ తేదీకి ఫిక్స్ చేసింది. కాగా రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీనే తన ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇటీవల 790 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. అందులో సోనమ్ రఘువంశీని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులు ముగ్గురు సహ నిందితులుగా ఉన్నారు. ఈ ఏడాది మే 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అదే సిటీకి చెందిన సోనమ్ వివాహం చేసుకుంది.
వివాహనం తర్వాత వారం కూడా తిరగకముందే ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం మే 20న హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లింది. అక్కడ మే 22న ఆమె ప్రియుడి ముగ్గురు స్నేహితులు రాజా రఘువంశీని హత్య చేశారు. తర్వాత శవాన్ని లోయలో పడేసి సోనమ్ సహా నలుగురూ ఇండోర్‌కు వెళ్లారు. రాజారఘువంశీ దంపతులు గల్లంతైన వార్త అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జూన్ 1న రాజా మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత వారం రోజులకు సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది.