శ్రీనగర్, ఏప్రిల్ 25 : ఉగ్రవాదులు పన్నిన ట్రాప్ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ.. దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళాలు వస్తాయని ఊహించి వారు రాగానే యాక్టివేట్ అయ్యేలా ఐఈడీలు ఉంచాడు. అతను ఊహించినట్టే ఇంటిని తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్ పోలీసులు వెళ్లారు. వారు ఇంట్లోకి రాగానే పేలుడు పదార్థాలు యాక్టివ్ అయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే బయటకు వచ్చిన కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. మరో ఉగ్రవాది ఆదిల్ థోకర్ ఇంట్లో కూడా ఇలాగే బాంబు ద్వారా ట్రాప్ పెట్టినా పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్లతో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.