న్యూఢిల్లీ: అవినీతి పద్ధతుల ద్వారా ఇకపై ఎన్నికల్లో గెలవలేనందున కాంగ్రెస్ ‘సర్’ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలో, ఓట్ల చోరీయో కారణం కాదని, దాని నాయకత్వం వల్లే ఆ పార్టీ ఓటమి పాలయ్యిందని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో ఉంచాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని, అందుకే అది ‘సర్’ అంశాన్ని ఎత్తుకుందని చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల హయాంలో ఓటు చోరీ జరిగిన దృష్టాంతాలను ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్‌కు మద్దతిచ్చే వారు 28 మంది, నెహ్రూ వెనుక కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నా నెహ్రూ ప్రధాని అయ్యారని, ఇది కచ్చితంగా ఓటు చోరీయేనని షా ఆరోపించారు. రెండో ఘటన ఇందిరా గాంధీ హయాంలో జరిగిందని, ఆమె ఎన్నికను కోర్టు పక్కన పడేసిన తర్వాత ఆమె తనకు తానే రక్షణను మంజూరు చేయించుకున్నారని, ఇక సోనియా గాంధీ అయితే భారత దేశ పౌరురాలు కాకుండానే ఆమె పేరు ఇక్కడి ఓటరు లిస్టులలోకి ఎక్కిందని, ఇప్పుడా అంశం సివిల్ కోర్టుకు చేరిందని అన్నారు.