Amit Shah : అక్రమంగా దేశంలోకి వస్తున్న చొరబాటుదారులను కొన్ని రాజకీయ పార్టీలు (Political parties) రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతాబెనర్జీ (Mamata Banerjee) ని ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) పై మమతాబెనర్జి సీఈసీ జ్ఞానేశ్వర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా ఈ విధంగా స్పందించారు. కొన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు చొరబాటుదారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాటుదారులను అడ్డుకోవడం దేశ భద్రతకు ఎంతో కీలకమని చెప్పారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు చొరబాట్లను నిరోధించాల్సిన అవసరం ఉందని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అయితే ఆయన నేరుగా మమతా బెనర్జి పేరును ప్రస్తావించలేదు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని విపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో షా పై వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ మమతాబెనర్జీ సీఈసీకి లేఖ రాశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బెంగాల్లో అరాచకంగా, బలవంతంగా, ప్రమాదకరంగా సాగుతోందని ఆరోపించారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన సమాచారం లేకుండానే ఎస్ఐఆర్ చేపట్టారని మండిపడ్డారు. ఎస్ఐఆర్లో పాల్గొంటున్న అధికారులు అసాధారణ పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.