Hindu temple : అగ్ర రాజ్యం అమెరికా (USA) లో హిందూ ఆలయాల (Hindu Temples) పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని హిందూ ఆలయంపై కొందరు విద్వేషపు రాతలు రాశారు. చినో హిల్స్‌లోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరం (BAPS Shri Swaminarayan Mandir) పై కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయ అధికారులు ఎక్స్ వేదికగా ఈ దుశ్చర్య గురించి వెల్లడించారు.
భారత్ ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య. ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం’ అని జైశ్వాల్ పేర్కొన్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. కాలిఫోర్నియా శాఖ్రమెంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై విద్వేషపూరిత రాతలు రాశారు. దానికి ముందు సైతం న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం వద్ద దుండగులు ఇదేవిధంగా వ్యవహరించారు.