న్యూఢిల్లీ: దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్‌కు ప్రముఖ హిందీ రచయిత వినోద్‌కుమార్ శుక్లా ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ అవార్డు అందుకోనున్న మొదటి రచయిత శుక్లానే కావడం విశేషం. 2024 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ 59వ అవార్డు గ్రహీతను శనివారం ప్రకటించింది.
లఘు కథల రచయిత, కవి, వ్యాసకర్తగా పేరొందిన 88 ఏండ్ల శుక్లా హిందీ భాషలో గొప్ప సమకాలీన రచయితలలో ఒకరు. హిందీ భాష నుంచి ఈ అవార్డు అందుకున్న వారిలో శుక్లా 12వ వ్యక్తి. అవార్డు కింద రూ.11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం అందజేస్తారు.