బెంగళూరు: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డిస్ప్లే బోర్డుల నుంచి హిందీని తొలగించారు. ప్రస్తుతం అన్ని బోర్డుల్లో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే విమానాల రాకపోకల వివరాలు కనిపిస్తున్నాయి. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ‘కేవలం ఇంగ్లిష్, కన్నడ వచ్చినవారు మాత్రమే బెంగళూరును సందర్శించాలా’ అని కొందరు నెటిజన్లు బెంగళూరు విమానాశ్రయ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ ప్రిన్స్ లాంటి ప్రముఖులు హిందీని గౌరవించి ఆ భాషలో ట్వీట్లు చేస్తుంటే.. సొంత పౌరులు కొందరు హిందీని గౌరవించడం లేదని ఒక నెటిజన్ వాపోయారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘నేను హిందీ విధింపును వ్యతిరేకిస్తాను. కానీ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రయాణ కేంద్రాల నుంచి ఆ భాషను తొలగించడం అవివేకం. ఈ ప్రదేశాలు ప్రయాణాన్ని సులభతరం చేయాలి కాని క్లిష్టతరం చేయకూడదు’ అని పేర్కొన్నారు.
దక్షిణాసియాలో భూ ప్రకంపనలు ; గంట వ్యవధిలో భారత్,మయన్మార్, తజకిస్థాన్‌లో నాలుగు భూకంపాలు
న్యూఢిల్లీ: దక్షిణాసియాలో ఆదివారం ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు మూడు దేశాల ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. కేవలం గంట వ్యవధిలో భారత్, మయన్మార్, తజకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు భూకంపాలు రావడం ఈ ప్రాంతంలోని భూ పలకల అస్థిరతను గుర్తు చేసింది. మొదట రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో హిమాచల్‌లోని మండిలో భూకంపం సంభవించింది. 5.5 తీవ్రతతో సెంట్రల్ మయన్మార్ లో ప్రకంపనలు వచ్చాయి. కొంతసేపటికి తజకిస్థాన్‌లో 6.1 తీవ్రతతో ఒకటి, 3.9 తీవ్రతతో మరొక భూకంపం వచ్చింది. ఈ భూకంపాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. వరుస భూకంపాలు హిమాలయ, మధ్య ఆసియా ప్రాంతాల్లో భూమి పలకల నిర్మాణంపై ఆందోళనలను రేకెత్తించాయి.