Hindi | ముంబై: హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్, ఎంఎన్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఎక్స్‌లో స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపైన కూడా విరుచుకుపడ్డారు. త్రిభాషా సూత్రాన్ని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేసుకోవాలని, విద్య విషయంలో దానిని తీసుకురావద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రతి దానినీ హిందీయీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అనుమతించేది లేదన్నారు.
మరాఠీ, మరాఠీయేతరుల మధ్య ఘర్షణను సృష్టించి, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ స్పందిస్తూ, ఈ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.