Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు.. పనులు చేసేందుకు మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్ని కార్మికులుగా తీసుకోవాలని సూచించారు. అవసరమైతే మియా ముస్లింలను అడ్డుకోవాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం అసోంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మియా ముస్లింలు అంటే.. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు.
వారు అక్రమంగా నివసిస్తుంటారు. వారు దశాబ్దాలుగా అసోంలో కార్మికులుగా వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. ఎక్కువ మంది కార్మికులు మియా ముస్లింలే. కారణం.. వీరు చాలా తక్కువ వేతనాలకే పని చేస్తారు. అందుకే కాంట్రాక్టర్లు కూడా వీరికే ప్రాధాన్యమిస్తుంటారు. దీంతో స్తానికులకు ఉపాధి దొరకడం లేదని అసోంలోని ఇతర వర్గాల వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రజలనే తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించడం విశేషం. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ‘‘అస్సామీలు మొఘల్స్‌పై యుద్ధాలు గెలవగా లేనిది బ్రిడ్జిలు ఎందుకు కట్టలేరు..? బోగిబీల్ బ్రిడ్జిని స్తానికులే కట్టారు. మార్పు రావాల్సిన సమయం వచ్చింది. అందుకే మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్నే పనుల్లోకి తీసుకోమని ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లకు చెప్పాను. ఢుబ్రి, బార్పెట వంటి వెనుకబడిన ప్రాంతాలవారికి ప్రాధాన్యమివ్వాలి.
నా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కూడా చెబుతున్నా.. ఇందులో దాచేదేమీ లేదు. అవసరమైతే మియా ముస్లింలను ఎలాగైనా అడ్డుకోండి. వారికి ఇబ్బంది అయితే.. రాష్ట్రం విడిచివెళ్లొచ్చు. మేం మియా ముస్లింలకు వ్యతిరేకం అని నేరుగా చెప్తున్నాం. నేను వారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే అర్ధరాత్రి అయినా వెళ్తాను‘‘ అని అన్నారు. మరోవైపు అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌పై కూడా హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. అతడు పాకిస్తాన్ ఏజెంట్ అని మళ్లీ చెబుతున్నానని, అవసరమైతే దీనిపై తన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సవాలు విసిరారు. వారికి దమ్ముంటే తన మీద కేసు వేయండి అంటూ ఛాలెంజ్ చేశారు. అయితే, మియా ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వర్గాలు ఖండిస్తున్నాయి.