న్యూయార్క్: భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(Sunita Williams).. 286 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే భూమి మీదకు వచ్చిన ఆ వ్యోమగామి విల్మోర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతరిక్షం నుంచి ఇండియా ఎలా కనిపించిందో చెప్పిందామె. ఉత్తర భారతంలోని హిమాలయాలు అద్భుతంగా ఉన్నట్లు సునీతా పేర్కొన్నది. హిమాలయాలు అమేజింగ్‌గా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఆ ప్రాంతం నుంచి ప్రయాణించిన ప్రతిసారీ తన తోటి ఆస్ట్రోనాట్ విల్మోర్ ఫోటోలు తీసేవారని తెలిపింది. హిమాలయాలకు చెందిన అద్భుతమైన ఫోటోలను విల్మోర్ తీశారని, ఆ శిఖరాలు అద్భుతంగా ఉన్నట్లు సునీతా చెప్పింది.
భారతీయ ల్యాండ్‌స్కేప్ గురించి ఇంకా ఎన్నో విషయాలను వెల్లడించింది సునీతా. పశ్చిమ తీరంలో ఉన్న మత్స్యకారుల బోట్లు గురించి కూడా ఆమె కామెంట్ చేసింది. తూర్పు నుంచి పశ్చిమ దిశగా వెళ్తున్న సమయంలో.. గుజరాత్, ముంబై తీర ప్రాంతంలో ఫిషింగ్ బోట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు సునీతా పేర్కొన్నది. రాత్రి వేళ అంతరిక్ష కేంద్రం నుంచి ఇండియాను గమనిస్తే, అనేక పట్టణాల్లో వెలుగుతున్న లైట్లు ఆ నగరాలకు శోభనిచ్చాయన్నారు.
సునీతా విలియమ్స్ తండ్రి గుజరాతీ. భారతీయ మూలాలు ఉన్న ఆమె.. ఇండియాలో పర్యటించనున్నట్లు చెప్పారు. అంతరిక్ష పరిశోధనల గురించి భారతీయులతో ముచ్చటిస్తానని కూడా వెల్లడించారు.