న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతున్నది. అనేక రాష్ర్టాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊర్లకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడగా జమ్ము కశ్మీరు, ఉత్తరాఖండ్‌లో అనేకమంది వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. గత కొన్ని రోజులుగా మేఘ విస్ఫోటాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో ఉత్తరాఖండ్ చిక్కుకుంది. పంజాబ్‌లో 29 మంది మరణించగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భీకరమైన వరదలను పంజాబ్ ఎదుర్కొంటున్నది. దేశ రాజధాని ఢిల్లీ, దాని పొరుగున ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఇళ్లను ముంచెత్తుతుండడంతో సమీపంలోని బ్యారేజీల నుంచి నీటి విడుదల ఎప్పటికప్పుడు జరుగుతున్న కారణంగా మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరో ఏడు రోజుల వరకు తెరపి ఉండబోదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జమ్ము కశ్మీరు, గురుగ్రామ్, యూపీ, చండీగఢ్తోసహా అనేక ప్రాంతాలలో పాఠశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. భారీ వర్షం కారణంగా సోమవారం దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో మంగళవారం గురుగ్రామ్‌లోని ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. వరదలు రోడ్లను ముంచెత్తడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జమ్ము కశ్మీరు, ఉత్తరాఖండ్‌లో అనేక చోట్ల కొండచరియలు హైవేలపై పడడంతో అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతోపాటు డ్యాంల నుంచి నీటిని విడుదల చేయడంతో పంజాబ్‌లోని 10కిపైగా జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. గడచిన 25 ఏళ్లలో మొట్టమొదటిసారి సాధారణం కన్నా 74 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టులో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 253.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగలదని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రజలను హెచ్చరించారు. వారం రోజుల్లో 29 మంది మరణించగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారని మాన్ చెప్పారు.
జమ్ము కశ్మీరులో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా గత పక్షం రోజుల్లో 50 మందికిపైగా మరణించారు. వరుసగా 8వ రోజు మంగళవారం కూడా జమ్ము-శ్రీనగర్ హైవే మూతపడింది. ఎడతెరపిలేని వర్షాల వల్ల రాజౌరీ, సంబా జిల్లాల్లో భూమి కుంగినట్లు వార్తలు అందాయి. దీంతో 19 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించినట్లు తెలిసింది. వర్షాలు, వరదల కారణంగా 500 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది.
భారీ వర్షాలు, మేఘ విస్ఫోటాలు సృష్టించిన ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్‌లో విలయాన్ని సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా 10 మంది మరణించగా మరో 69 మంది కనిపించకుండాపోయారు. ఆకస్మిక వరదలకు అనేక ఇళ్లు ధ్వంసం కావడంతో ప్రజలతోపాటు జంతువులు సైతం శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీరు, హర్యానాలతోసహా వాయువ్య భారత్‌లో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఐఎండీ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. రోడ్లపై కొండచరియలు విరిగిపడడంతో అనేక ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. 257 రోడ్లు తెగిపోవడంతో వేలాదిమంది వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మండి, బనాలా మధ్య అనేక చోట్ల కొండచరియలు పడడంతో వరుసగా రెండవ రోజు కులూ-మనాలీ, లహోల్-స్పిటి, లేహ్-లద్దాఖ్‌ను కలిపే మార్గాలను కలిపే కిరాత్పూర్-మనాలీ నాలుగు లేన్ల రహదారి మూతపడింది. దీంతో మండి, కులూలో 2,000కిపైగా వాహనాలు నిలిచిపోయాయి. పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.