Record Rain Fall | ఈ ఏడాది ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా వర్షాపాతం నమోదైంది. దాంతో 76 సంవత్సరాల రికార్డు బద్దలైంది. 1901 నుంచి ఈ ఆగస్టులో తొమ్మిదోసారి అత్యధిక వర్షపాతం (431.3 మిల్లీమీటర్లు) నమోదైంది. 1949 నుంచి ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. గతంలో అత్యధిక వర్షపాతం (542.4 మి.మీ) 1927లో నమోదైంది. సిమ్లా వాతావరణ కేంద్రం విడుదల చేసిన డేటా పేర్కొంది. ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్‌లో 256.8 మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా పేర్కొంటారు. కానీ, ఈ సారి 431.3 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. సాధారణం కంటే 68శాతం ఎక్కువ. ఈ సమయంలో కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 816.2 మి.మీ వర్షపాతం నమోదవగా.. అత్యల్పంగా లాహౌల్-స్పితి జిల్లాలో 129.7 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. బిలాస్పూర్, చంబా, కిన్నౌర్, కులు, మండి, సిమ్లా, సోలన్, ఉనా జిల్లాల్లో ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ డేటా పేర్కొంది. హమీర్పూర్, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా తెలిపింది.
ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 7 వరకు వర్షాకాలం సీజన్ ఉంటుందని సిమ్లా వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, కాంగ్రా, సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హమీర్పూర్, చంబా, కులు, మండి, కిన్నౌర్, లాహౌల్-స్పితి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. సెప్టెంబర్ 2న కాంగ్రా, మండి, సిర్మౌర్లకు రెడ్ అలర్ట్.. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3న సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం వాతావరణశాఖ అంచనా వేసింది. వర్షాలు, వరదల కారణంగా జూన్ 20 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 320 మంది ప్రాణాలు కోల్పోయారు. 379 మంది గాయపడ్డారు. 40 మంది ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఈ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 154 మంది మరణించారు. ఇప్పటివరకు 4,569 ఇండ్లు, దుకాణాలు కొండచరియలు విరిగిపడడం, వరదల కారణంగా దెబ్బతిన్నాయి.