Marriage | సిమ్లా : ప్రతీ జంట తమ పెళ్లిని ఘనంగా నిర్వహించుకోవాలని కలలు కంటారు. మంగళ స్నానాల నుంచి మొదలుకుంటే.. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల సాక్షిగా వివాహం జరగాలని కోరుకుంటారు. కానీ ఓ పెళ్లి మాత్రం వర్షం సాక్షిగా.. నిర్ణయించిన ముహుర్తానికి ఆన్లైన్ వేదికగా జరిగింది. ఎందుకంటే అక్కడ భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో.. బయటకు కదల్లేని పరిస్థితి. దీంతో ఇవేవీ అడ్డంకులు కాదని భావించిన ఆ జంట.. ఆన్లైన్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది.
వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా కోట్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘాకు, కులు జిల్లాలోని భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు వివాహం జరిపించాలని ఇటీవలే ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. జులై 12న వీరిద్దరికి వివాహం చేయాలని ముహుర్తం ఖరారు చేశారు. ఇక పెళ్లి ఏర్పాట్లన్నీ చేశారు. కానీ గత నాలుగైదు రోజుల నుంచి హిమాచల్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా.. వరదలు పోటెత్తాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఆశిష్ సింఘాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కులు ప్రాంతానికి చేరుకోలేకపోయారు.
ఇక చేసేదేమీ లేక నిర్ణయించిన ముహుర్తానికి ఆన్లైన్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్, శివానీకి పెళ్లి చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వర్షం సాక్షిగా ఒక్కటైన ఈ జంటకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.