Himachal Pradesh | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పది గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ర్టాన్ని దివాలా అంచులో నిలబెట్టింది. హామీల అమలు పేరిట ఇప్పటికే కొత్త అప్పులు చేస్తూ.. ప్రభుత్వోద్యోగుల జీతాలను పెండింగ్‌లో ఉంచిన సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు చివరకు పింఛనర్ల సంక్షేమ నిధి డబ్బులను కూడా వాడుకొన్నది. ఇప్పుడు తాజాగా దేవుడి సొమ్మునూ వదలట్లేదు.
ప్రభుత్వ పథకాలను కొనసాగించడానికి ఖజానాలో సొమ్ములేదన్న ప్రభుత్వం.. రాష్ట్రంలోని ఆలయాల ట్రస్టులు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పేద విద్యార్థుల కోసమని తాము ప్రారంభించిన ముఖ్యమంత్రి సుఖ్ఆశ్రయ్ యోజన, ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజన పథకాలను ఆలయ ట్రస్టులు అందజేసే విరాళాలతో కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ మేరకు జనవరి 29న ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రకృతి విపత్తులతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్టు చెప్పుకొచ్చింది.
సుఖు ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయం తమను షాక్‌కి గురిచేసిందని బీజేపీ నేత, మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం గతంలో ఏ సర్కారూ ఆలయాల సొమ్మును వినియోగించలేదని గుర్తుచేశారు. కాగా అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కాకముందే రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు ఆర్థికంగా కుదేలయ్యేలా చేసిందన్న విమర్శలు పెద్దయెత్తున వ్యక్తమవుతున్నాయి. దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం అప్పు రూ.95 వేల కోట్లకు చేరినట్టు ఆర్థిక విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం.