సిమ్లా : కరోనా వైరస్ వ్యాక్సినేషన్లో హిమాచల్ ప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో కొవిడ్-19 టీకా సింగిల్ డోస్ నూరు శాతం పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 18 ఏండ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ తొలి డోసు అందచేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజీవ్ సైజల్ వెల్లడించారు.
ఈ ఏడాది నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ నూరు శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కొవిడ్-19 కట్టడికి హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు, సత్వర వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచీ సమర్దవంతంగ పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాని వారు ఇంకా మిగిలిఉంటే వారందరికీ త్వరలో టీకాలు వేస్తామని తెలిపారు.