సిమ్లా, సెప్టెంబర్ 4 : ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వొద్దని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు కు గురైన ఎమ్మెల్యేలు అందరికీ ఇది వర్తిస్తుంది. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్ల్లో ఈ ఆరుగురిలో ఇద్దరు మళ్లీ గెలవగా, నలుగురు ఓడిపోయారు. వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు రాకుండా ఈ బిల్లును తీసుకొచ్చింది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారని కాంగ్రెస్ పార్టీ వారి శాసనసభ సభ్యత్వాలపై అనర్హత వేటు వేసింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో తమ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినప్పుడు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పేర్కొన్నది. అయితే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ర్టాల్లో మాత్రం వేరే పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నది. తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ఇండ్లకు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరైన దానం నాగేందర్‌ను కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లోనూ బరిలో నిలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఈ ధోరణి పట్ల రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ రాష్ర్టానికో నీతిని పాటిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో విపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేస్తున్న ఆ పార్టీ.. హిమాచల్‌లో మాత్రం పార్టీ ఫిరాయించినవారికి పెన్షన్ కట్ చేస్తామని చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ చేస్తున్న విన్యాసాలు ఇవి అని ఎక్స్‌లో మండిపడ్డారు.
షిమ్ల, సెప్టెంబర్ 4 : ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా ఇవ్వడాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సమర్థించుకున్నారు. వేతనాలు, పింఛన్లు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ప్రతి నెల రూ.3 కోట్లు వడ్డీ ఆదా చేయవచ్చని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు సైతం ఇవ్వలేకపోతున్నదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం సుఖు బుధవారం స్పందిస్తూ.. ప్రతి నెల 6వ తేదీ కేంద్రం నుంచి రాష్ర్టానికి రెవెన్యూ లోటు నిధులు(ఆర్డీజీ), 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు అందుతాయని తెలిపారు. ఈ నిధులు రాకముందే ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7.5 శాతం వడ్డీకి అప్పు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. దీంతో నెలకు రూ.3 కోట్లు, ఏడాదికి రూ.36 కోట్ల వడ్డీ భారం పడుతున్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల మాత్రం వనరులను ఎలా సమర్థంగా వినియోగించాలో గుర్తించేందుకు వేతనాలు ఆలస్యం చేశామని, గురువారం వేతనాలు, 10న పింఛన్లు ఇస్తామని వెల్లడించారు. అయితే, గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని దివాలా తీయించిందని బీజేపీ విమర్శిస్తున్నది.