Hilsa fish : బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. బంగ్లాదేశ్ నుంచి హిల్సా చేపల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. త్వరలో 3 వేల టన్నుల పద్మాపులస (Hilsa) చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.
కాగా, పశ్చిమ బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తమ ఇళ్లలో హిల్సాను వండుకొని తింటారు. కొంతమంది బెంగాల్ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ప్రతి ఏడు దుర్గా పూజ సమయానికి భారత్‌కు బంగ్లాదేశ్ హిల్సా చేపలను ఎగుమతి చేస్తుంది. సాధారణంగా కోల్‌కతా మార్కెట్లలో కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో ఈ హిల్సా చేపలు పుడతాయి. అందుకే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది.
ప్రపంచంలోని దాదాపు 70 శాతం హిల్సాలు బంగ్లాదేశ్‌లోనే ఉత్పత్తి అవుతాయి. 2012లో తీస్తా నది నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌కు, బంగ్లాకు మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ చేపల ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ కారణంగా పశ్చిమబెంగాల్ మార్కెట్లలో వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో హిల్సా చేపల స్మగ్లింగ్ మొదలయ్యింది. దీంతో 2022లో అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా నిషేధాన్ని ఎత్తివేశారు.