(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే ప్రభుత్వ పాలనలో సామాన్యుడి సంపాదన ఆశించినంతగా పెరుగకపోయినప్పటికీ.. పన్నుబాదుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కేంద్రం ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను మొత్తం అక్షరాలా రూ. 329 లక్షల కోట్లు. గడిచిన 11 ఏండ్లలోనే పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. అలా సగటున ఒక్కో వ్యక్తి రూ. 2.25 లక్షలను పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాడు.
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మనం వినియోగించే ప్రతి వస్తువు, సేవకూ పన్ను కడుతున్నాం. ఇలా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు, ఒంటిపైకి చేరే ప్రతి అలంకరణకు, చివరికి రోగమొస్తే చికిత్సకు, మందులకు ఇలా జీవితంలో మనం వాడే ప్రతీ వస్తువు, సర్వీసుకూ ప్రభుత్వం పన్నులు పిండుకుంటున్నది. 2014లో నరేం ద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో రూ.17.94 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తే, 2025నాటికి అది రూ.50 లక్షల కోట్లు దాటింది. అంటే గడిచిన 11 ఏండ్లలో పేద, మధ్యతరగతి ప్రజలపై ఎన్డీయే ప్రభుత్వం మూడింతల పన్నుపోటు పొడిచిందన్న మాట. 2014లో ఒక్కొక్కరి నెత్తిన సగటు పన్ను రూ.12 వేలుగా ఉండగా.. 2025నాటికి అది రూ.34 వేలకు చేరింది. అలా 11 ఏండ్లలో మొత్తంగా సగటున ఒక్కొక్కరి నెత్తిన పన్నుభారం రూ. 2.25 లక్షలను కేంద్రం మోపింది. భారత్లో ఉన్నటువంటి పన్నుల తీవ్రత ప్రపంచంలోని మరే ఇతర దేశంలో లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పన్నుల పేరిట సామాన్యులను బాదుతున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచిందా? అంటే అదీ లేదు. 2014లో దేశంలో ఒక్కో చిరుద్యోగి సగటు ఆదాయం నెలకు రూ. 7 వేలుగా ఉంటే, ప్రస్తుతం రూ. 14 వేలు కూడా దాటట్లేదు. తలసరి ఆదాయంలోనూ దాదాపుగా ఇదే సరళి కనిపిస్తున్నది. ఇక, ప్రభుత్వ పన్ను పోటుతో దేశంలోని కుటుంబాల నికర పొదుపు నిల్వల మొత్తం 47 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక కుండబద్దలు కొట్టింది.
దేశ జీడీపీలో కుటుంబాల పొదుపు విలువ 5 శాతానికి పరిమితమవ్వడం కలవరపెడుతున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇక, దేశంలోని ఒక్కో పౌరుడి నెత్తిపై రూ. 4.8 లక్షల అప్పు ఉన్నదని ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్-2025’ పేరిట ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో తేలింది. గడిచిన రెండేండ్ల వ్యవధిలోనే ఈ అప్పు రూ. 90 వేల మేర పెరిగినట్టు సదరు నివేదిక వెల్లడించింది.
ఒకవైపు పన్నులతో ఖజానాను నింపుకొంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ప్రజల ఉపాధి అవకాశాలను కల్పించి వారి ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైనట్టు నివేదికలను బట్టి అర్థమవుతున్నది. దేశంలో నిరుద్యోగిత రేటు కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. మొత్తంగా మోదీ ప్రభుత్వ పాలనలో సామాన్యుల బతుకు దిన దినగండం నూరేండ్ల ఆయుస్సు చందంగా తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.