IMD | న్యూఢిల్లీ, జనవరి 1: అధిక ఉష్ణోగ్రతల్లో 2024 సంవత్సరం కొత్త రికార్డును సృష్టించింది. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది గత ఏడాదేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. భారత్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో 1991 – 2020 మధ్య దీర్ఘకాల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
గత ఏడాది వాతావరణ పరిస్థితులపై బుధవారం ఆయన వర్చువల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత్లో భూ ఉపరితల వార్షిక వాయు ఉష్ణోగ్రత సైతం దీర్ఘకాల సగటు కంటే 0.65 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. ఇంతకుముందు అత్యధికంగా 2016లో 0.54 డిగ్రీలు నమోదయ్యిందని గుర్తు చేశారు.