న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. (High-Level Security Committee Meet) కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర అధికారులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, అనంతర పరిణామాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
కాగా, మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్లోని బైసరన్‌లో సేద తీరుతున్న మగ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారు ఏ మతానికి చెందిన వారో అన్నది తెలుసుకుని మరీ చంపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు విదేశీయులతో సహా 28 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బుధవారం బాధిత కుటుంబాలు, ప్రాణాలతో బయటపడిన వారితో అమిత్ షా భేటీ అయ్యారు.
మరోవైపు ఢిల్లీలో సీనియర్ రక్షణ అధికారులతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. సాయుధ బలగాలు తమ పోరాట సంసిద్ధతను పెంచుకోవాలని, లోయలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రం చేయాలని ఆదేశించారు. పహల్గామ్ ఉగ్ర దాడికి తెరవెనుక ఉన్న వారిని కూడా తాము విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పరోక్షంగా పాకిస్థాన్‌ను ఆయన హెచ్చరించారు. ఈ కుట్రకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ భారతదేశం గుర్తించి న్యాయం చేస్తుందని అన్నారు.