చండీగఢ్ : ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన దోషిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని తల్లిపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 మే 31న టెంట్ ఇన్స్టాలర్ కుమార్తె (ఐదున్నరేండ్ల వయసు)ను అతని వద్ద పని చేస్తున్న వ్యక్తి తీసుకెళ్లాడు. అతను తన ఇంటికి ఆమెను తీసుకెళ్లి, అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఆ సమయంలో అతని తల్లి ఇంట్లో లేదు. అతని ఇంటికి స్థానికులు వచ్చేటప్పటికి అతని తల్లి ఇంట్లోనే ఉంది. అయితే, బాలికను, తన కొడుకును తాను చూడలేదని చెప్పింది. ఇంట్లోకి ఎవరినీ అడుగు పెట్టనివ్వలేదు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని ఉంచి, పారేసిన పెద్ద డ్రమ్మును స్థానికులు ఆ ఇంటి వెనుక భాగంలో గుర్తించారు. ట్రయల్ కోర్టు 2024 జనవరి 24న ఈ కేసులో దోషికి మరణ శిక్ష, అతని తల్లికి ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
ఈ తీర్పుపై వీరిద్దరి అప్పీలును హైకోర్టు విచారించింది. ఈ దేశంలో తల్లులు తమ ‘విలువైన’ కొడుకులపై గుడ్డి ప్రేమను ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారులు ఎంత దుర్మార్గులైనా వారిని ప్రేమిస్తున్నారని, ‘రాజ కుమారులు’గా చూస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకు ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు తెలుసుకున్న తల్లి తన కుమారుడిని కాపాడటానికి ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బదులు తన కొడుకును రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. దోషికి మరణ శిక్షను 30 సంవత్సరాల జైలు శిక్షకు తగ్గించారు. రూ.30 లక్షల జరిమానా విధించారు. ఈ సొమ్మును బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించారు. తల్లి నిర్దోషి అని తీర్పు చెప్పారు.