Kolkata Doctor | కోల్‌కతా/న్యూఢిల్లీ, ఆగస్టు 16: కోల్‌కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. ఈ సందర్భంగా ఐఎంఏ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు ఉంచింది. ఎయిర్‌పోర్టుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలను కూడా ‘సేఫ్ జోన్లు’గా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వీ ఆశోకన్ డిమాండ్ చేశారు. వైద్యులు, సిబ్బందిపై దాడుల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలన్నారు. బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యుల పని గంటలు, పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమా ండ్ చేసింది. హత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ దవాఖానపై దుండగులు సృష్టించిన విధ్వంసం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమేనని కలకత్తా హైకోర్టు శుక్రవారం పేర్కొన్నది. దవాఖానలో పరిస్థితిపై ఈనెల 21లోగా వేర్వేరుగా అఫిడవిట్లు సమర్పించాలని పోలీసులు, హాస్పిటల్ యాజమాన్యాన్ని చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దవాఖాన వద్ద దాదాపు 7 వేల మంది గుమిగూడుతారన్న నిఘా వర్గాల సమాచారం పోలీసుల వద్ద లేదనడం నమ్మడం కష్టమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘ఇది పూర్తిగా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. తమ సొంత వ్యక్తులను కూడా పోలీసు బలగాలు రక్షించుకోలేకపోవడం విచారకరం’ అని పేర్కొన్నది. హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులకు తగిన రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. మూకను అదుపు చేయలేక పోలీసులు గాయపడ్డారంటే, శాంతి భద్రతలు విఫలమైనట్టేనని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 21కు వాయిదా వేసింది.
ఆర్జీ కార్ దవాఖానలో బీజేపీ, సీపీఎం పార్టీలే విధ్వంసానికి పాల్పడ్డాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆధారాలను నాశనం చేసేందుకు ఆ పార్టీలు ఇలా చేశాయని అన్నారు. కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన నిరసన ర్యాలీలో మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై వాస్తవాలు బయటకు రావాలని, అయితే కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయిస్తున్నారని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనపై బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, దీక్షలు చేపట్టింది.
న్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనతో వైద్యసంస్థలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్యసిబ్బందిపై దాడి జరిగిన ఆరు గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేస్తూ దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ దవాఖానలు, ఎయిమ్స్ డైరెక్టర్లకు, అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ ఆదేశాలిచ్చారు. ‘విధుల్లో ఉండగా ఏ ఆరోగ్య కార్యకర్తపైనైనా దాడి జరిగితే.. 6 గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే బాధ్యత వైద్య సంస్థ అధిపతిదే’ అని పేర్కొన్నారు.