High Alert In Delhi | ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో పేలుడు జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది దుర్మరణం పాలవగా.. మరికొందరు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలన్ని ఛిద్రమయ్యాయి. పేలుడు ధాటికి పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నుంచి బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించింది. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. పేలుడు తర్వాత ఢిల్లీ నగరంలో హైఅలెర్ట్ జారీ చేసింది.
సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ -1 సమీపంలో జరిగిన పేలుడు జరిగిందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ తాను గురుద్వారాలో ఉన్న సమయంలో భారీ శబ్దం వినిపించిందని.. అదేంటో అర్థం కాలేదని.. ఆ తర్వాత సమీపంలో పార్క్ చేసిన వాహనాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. స్థానికుడు రాజ్‌ధర్ పాండే మాట్లాడుతూ తన ఇంటి నుంచి చూస్తే పెద్ద ఎత్తున మంటలు కనిపించాయని చెప్పాడు. పేలుడు చాలా శక్తివంతంగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్న వీధి దీపాలు ఆరిపోయాయని ప్రత్యక్ష సాక్షులు కొందరు పేర్కొన్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో క్లూస్‌టీమ్, ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎర్రకోట ప్రాంతం ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే, అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటి. పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.