Delhi | పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించారు. ప్రజలెవరూ బయటతిరగవద్దని ఆదేశించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ అధికారికీ సెలవులు ఇవ్వద్దని స్పష్టం చేసింది.
ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమై.. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశాయి. సరిహద్దు జిల్లాల్లోని స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. పంజాబ్ ప్రభుత్వం అక్కడి పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. హరియాణాలోనూ పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగుల సెలవునుల రద్దు చేసింది. బార్మర్, జైసల్మేర్, జోధ్‌ఫూర్ సహా పలు జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు బ్లాక్అవుట్ను అమలు చేస్తున్నారు. గుజరాత్ తీర ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు. సెలవుల్లో ఉన్నవారిని తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌పై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. గురువారం రాత్రి సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు ప్రయోగించింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్‌ను విరోచితంగా కూల్చివేసింది. అలాగే రాజస్థాన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూడా కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రెండు జేఎఫ్17 యుద్ధ విమానాలను సైతం కూల్చివేసిందని సమాచారం. అయితే ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వెల్లడించింది.