Perzea : భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ (Hetero Healthcare Ltd) బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చింది. హెచ్ఈఆర్2-పాజిటివ్ (Her2-positive) రకం బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెర్టుజుమాబ్ అనే ఔషధానికి బయోసిమిలర్ అయిన పెర్జియా (Perzea) ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌జీన్ బయోసైన్సెస్ లిమిటెడ్ (Enzene Biosciences Ltd) తో కలిసి ఈ ఔషధాన్ని లాంచ్ చేసింది.
పెర్జియా 420 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.30 వేలుగా నిర్ణయించింది. పెర్టుజుమాబ్‌ను క్యాన్సర్ చికిత్సలో ట్రాస్టుజుమాబ్తో కలిపి వినియోగిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీల్లో ఈ కాంబినేషన్ కీలకంగా మారింది. పెర్జియా లాంచ్‌తో వేలాది మంది భారతీయ రోగులకు అధునాతన క్యాన్సర్ చికిత్సలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానున్నాయి. అంటే క్యాన్సర్ రోగులకు ఖర్చును తగ్గించడంలో హెటిరో సంస్థ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
హెటెరో సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సరసమైన ధరలు, ఆవిష్కరణలపై హెటిరో సంస్థ దృష్టి సారిస్తోందని చెప్పారు. ఎన్‌జీన్ బయోసైన్సెస్‌తో కలిసి పెర్జియాను లాంచ్ చేయడం ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సలను భారతీయ రోగులకు అందుబాటులోకి తేవాలన్న మా నిబద్ధతను హైలైట్ చేసిందని అన్నారు. ఎన్‌జీన్ బయోసైన్సెస్ సీఈఓ హిమాంశు గాడ్గిల్ మాట్లాడుతూ.. పెర్జియాను తీసుకురావడం కోసం హెటిరోతో భాగస్వామ్యాన్ని భారత క్యాన్సర్ చికిత్సలో మార్పుకు సంకేతంగా అభివర్ణించారు. ఆంకాలజి, యాంటీ వైరల్స్, క్రిటికల్ కేర్ విభాగాలపై హెటిరో హెల్త్‌కేర్ ఫోకస్ పెంచిందని చెప్పారు.