Hemant Soren |కేంద్రంలోని అధికార బీజేపీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను డబ్బు సంచులతో కొని విపక్షాలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ సీఎం చంపై సోరెన్.. బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో హేమంత్ సోరెన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
‘వారు ఇండ్లు కూల్చేయడంలో, రాజకీయ పార్టీలను ధ్వంసం చేయడంలో బిజీగా ఉన్నారు. ఒక రోజు వారు ఈ ఎమ్మెల్యేను కొనుగోలు చేయొచ్చు. మరుసటి రోజు మరొకరిని కొనుగోలు చేయొచ్చు. కానీ ఎల్లకాలం నాయకులను డబ్బు ప్రలోభ పెట్టలేదు. 2019 నుంచి రాష్ట్రంలోని ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం.. జార్ఖండ్ ప్రజలతో కలిసి గట్టిగా ఉంది’ అని సభలో మాట్లాడుతూ చెప్పారు. అధికార జేఎంఎలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో హేమంత్ సోరెన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
సీఎం హేమంత్ సోరెన్‌కు మాజీ సీఎం చంపై సోరెన్ అత్యంత సన్నిహితుడు. భూ ఆక్రమణ కేసులో అరెస్టయినప్పుడు హేమంత్ సోరెన్ స్థానే జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో ఆ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన హేమంత్ సోరెన్‌ను సీఎంను చేసేందుకు చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అర్ధంతరంగా తనను సీఎం పదవి నుంచి తప్పించడంపై చంపై సోరెన్ కినుక వహించారని వదంతులు వినిపిస్తున్నాయి. సీఎంగా తనను వైదొలగాలన్న తీరు బాధ కలిగించిందని చంపై సోరెన్ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.