Hemant Soren : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ.. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. సోరెన్ కుటుంబ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేపట్టారని అన్నారు. తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో వారు తన విలువైన సమయంతో పాటు ప్రజల సమయాన్నీ వృధా చేస్తున్నారని మండిపడ్డారు.
న్యాయస్ధానమే అత్యున్నతమైనదని, ఇవాళ కోర్టు సరైన తీర్పు వెలువరించిందని అన్నారు. ఇక ఎలాంటి చీకట్లూ లేవని, కానీ కొందరు కోర్టు సమయాన్ని వృధా చేస్తూ సమాజం కోసం పనిచేసే గొంతులను మూగబోయేలా చేసేందుకు అనవసరంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తమ గొంతు నొక్కేందుకు వారి అధికారాలనూ దుర్వినియోగం చేస్తున్నారని, ఈరోజు న్యాయస్ధానం తీర్పు ఈ విషయాలన్నింటినీ తేటతెల్లం చేస్తోందని చెప్పారు.
Read More :
Bogotha Waterfall | పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందడి