ముంబై: ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తిప్పికొట్టారు. సంక్షోభ సమయంలో మోదీకి తాను చాలా సహాయం చేసినట్లు చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమిమాట్లాడినా తాను పట్టించుకోనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ పవార్‌ను ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం ఆయన ఏమీ చేయలేదని ఆరోపించారు. అందుకే రైతులు కష్టాల్లో ఉన్నారని విమర్శించారు.
కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శరద్ పవార్ గురువారం స్పందించారు. తాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు (2004-2014) అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధాని అయిన మోదీకి చాలా సహాయం చేశానని తెలిపారు. ‘ఆయన (మోదీ) వ్యవసాయ రంగం సమస్యలతో నా దగ్గరకు వచ్చేవారు. నన్ను గుజరాత్‌కు కూడా తీసుకెళ్లారు. ఒకసారి ఆయన ఇజ్రాయెల్‌ను సందర్శించాలనుకున్నారు. నేను ఆయనను కూడా అక్కడికి తీసుకెళ్లా. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమి చెప్పినా నేను పట్టించుకోను’ అని మీడియాతో అన్నారు.