Puducherry – Helmet | ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారు రోడ్డు ప్రమాదాల బారీన పడకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. తాజాగా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ఆ జాబితాలో చేరింది. పుదుచ్చేరి పోలీసులు ఆదివారం నుంచి ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ తప్పనిసరి ధరించాలన్న నిబంధనను అమలు చేయడం ప్రారంభించారు. ఒకవేళ హెల్మెట్ ధరించకుంటే రూ.1000 పెనాల్టీ చెల్లించాలని పుదుచ్చేరి పోలీసులు నిబంధన విధించారు. దీంతో పుదుచ్చేరి అంతటా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్లు ధరిస్తూ తిరగడం కనిపించింది. వారాంతపు పర్యాటకులు సైతం పెనాల్టీ చెల్లించలేక హెల్మెంట్ ధరిస్తున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హెల్మెంట్ వాడని వాహన చోదకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని పుదుచ్చేరి సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. వాహన చోదకుల ప్రాణ రక్షణ కోసమే హెల్మెట్ నిబంధన అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాస నాథన్ హెల్మెట్ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్ర ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని, ప్రాణాపాయం తప్పుతుందని తెలిపారు.