పడిపోకుండా సేఫ్టీ హార్నెస్ బెల్టు
మోటారు వాహనాల చట్ట సవరణకి కేంద్రం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బైకులపై నాలుగేండ్లలోపు పిల్లలను తీసుకువెళ్లేప్పుడు వారికి హెల్మెట్, కిందపడిపోకుండా పట్టి ఉంచేలా బెల్టులాంటి వ్యవస్థ(సేఫ్టీ హార్నెస్) తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. పిల్లలు ధరించిన ఈ బెల్టును బైక్ నడిపే వ్యక్తి తన భుజాలు, నడుముకు కట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసింది. దీనిపై మంగళవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. నాలుగేండ్ల లోపు పిల్లలు బైక్ మీద కూర్చున్నప్పుడు వేగం 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2023 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదకరమైన రసాయనాలు, గ్యాస్ లాంటి వాటిని రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ డివైజ్ను తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిపై నెల రోజుల్లోగా అభిప్రాయాలు, సలహాలు తెలుపాలని కోరింది.