CIC Heeralal Samariya | కేంద్ర సమాచార హక్కు కమిషన్ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. గత నెల మూడో తేదీన వైకే సిన్హా పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్‌గా నియమితులైన తొలి దళితుడు హీరాలాల్ సమారియా. 1985- బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా కేంద్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖలో పని చేస్తూ రిటైర్ అయ్యారు. 2020 నవంబర్ ఏడో తేదీన కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌గా ప్రమాణం చేశారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. సమాచార హక్కు కమిషనర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కోరింది. రాష్ట్రాల వారీగా సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించిన సమాచారం సేకరించాలని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న వివరాలు తెలియజేయాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించింది.
కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా ప్రమాణం చేసిన తర్వాత కేంద్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీలతో ఆయన ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టక ముందు ఆనందీ రామలింగం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ సీఎండీగా పని చేశారు. వినోద్ కుమార్ తివారీ.. 1986-హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిగా, అటుపై కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శిగా పని చేశారు. కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్, కమిషనర్లు తమకు 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.