న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (Indian Meteorological Department – IMD) హెచ్చరించింది. ఉత్తరాఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల నాలుగు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన నివేదికలో పేర్కొన్నది.
అదేవిధంగా పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ వెల్లడించింది. అంతేగా వచ్చే మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు దక్షిణాదిలో కూడా తమిళనాడుకు అతిభారీ వర్ష సూచన ఉందని ఐఎండీ ప్రకటించింది.