గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 12:18:22

ఐఎండీ హెచ్చ‌రిక‌.. ఆ రాష్ట్రాల్లో వ‌చ్చే నాలుగు రోజుల్లో వ‌ర్షాలు

ఐఎండీ హెచ్చ‌రిక‌.. ఆ రాష్ట్రాల్లో వ‌చ్చే నాలుగు రోజుల్లో వ‌ర్షాలు

న్యూఢిల్లీ : రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగ‌ళ‌వారం తెలిపింది. బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌, అసోంల‌లోనూ వాన‌లు ప‌డుతాయ‌ని పేర్కొంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెప్పింది. సోమవారం దేశ రాజధానిలో చాలా ప్రాంతాల్లో 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ‌ని సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని ఝార్‌గ్రామ్ జిల్లాలో సోమ‌వారం పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెంద‌గా, 27 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు.

అసోంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌ద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 24ల‌క్ష‌ల మందిని ప్ర‌భావితం చేశాయి. అత్యంత దారుణంగా దెబ్బతిన్న జిల్లా గోల్‌పారాలో 4.59 లక్షల మంది ప్రభావితమయ్యారు. త‌ర్వాత బార్పేట‌లో 3.37 లక్షల మంది, మోరిగావ్‌లో 3.35 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు వరదల కార‌ణంగా 85 మంది మృతి చెంద‌గా, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో 26 మంది మృత్యువాత‌ప‌డ్డారు. హిమాచల్‌ప్ర‌దేశ్‌లోనూ గ‌త 24 గంట‌ల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. ధ‌ర్మ‌శాల‌లో 62మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.


logo