తిరువనంతపురం: తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌లోని కాట్రా వరకు ప్రయాణించే హిమసాగర్ ఎక్స్‌ప్రెస్(Himasagar Express) రైలును రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఇవాళ కన్యాకుమారి నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ఈ రైలు బయలుదేరాల్సి ఉన్నది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో భీకర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైలును రద్దు చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో వర్షాల వల్ల రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
కథువా.. మాదోపూర్ పంజాబ్ లైన్లో రైల్ జామ్ ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షం వల్ల రైల్వే ట్రాక్‌కు డ్యామేజ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే హిమసాగర్(ట్రైన్ నెంబర్ 16317) విక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రైలు కన్యాకుమారి నుంచి శ్రీ మాతా వైష్ణవో దేవి కాట్రాకు వెళ్తుంది. సాధారణ కేరళ ప్రజలు ఈ రైలుపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా అప్డేట్ చేసినట్లు తిరువనంతపురం రైల్వే స్టేషన్ పీర్వో తెలిపారు.
హిమసాగర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వర్షాల వల్ల అనేక రైళ్లను రద్దు చేశారు. జమ్మూలో వానలు, వరదల వల్ల కాట్రాకు వెళ్లే సుమారు 38 రైళ్లను రద్దు చేసినట్లు ఢిల్లీలోని రైల్వేశాఖ పేర్కొన్నది. హిమసాగర్ రైలు సుమారు 3800 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే. త్రికూట పర్వతాల్లో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేశారు.