ముంబై, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా, రోడ్లపై నీరు నిలిచింది. థానే, ఫాల్ఘర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో భారీ వర్షం కురిసింది. థానే జిల్లాలోని భీవండి పట్టణం కాల్హేర్ ప్రాంతంలోని దుర్గేశ్ పార్క్ ప్రాంతంలో ఉన్న భవనం ప్లాస్టిక్ కప్పుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయని నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మెనేజ్మెంట్ సెల్ అధికారి సాఖిబ్ ఖర్చే తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, మంటలతో భవనం ప్లాస్టిక్ పైకప్పు దెబ్బతిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్టు తెలిపారు. మరోవైపు వర్షాల కారణంగా ఫాల్ఘర్ జిల్లాలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇలా జరిగిన ప్రమాదంలోనే ఓ వ్యక్తి మరణించాడు. నవీ ముంబైలో ఆదివారం ఉదయం ఉరుమలు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆదివారం మొత్తం ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా మోస్తరు నంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశాలున్నాయి. రాయగఢ్ జిల్లాలో కూడా అకస్మాత్తుగా వర్షం కురిసింది. జిల్లాలోని ఉత్తర భాగమైన అలిబాగ్, కర్జత్, ఖాలాపూర్ ఖోపోలి, మాత్రాన్నలో మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాలా చోట్ల వరికోతలు చివరి దశలో ఉన్నాయి. ఈ అకాల వర్షాల వలన పంట నష్టం జరిగే అవకాశం ఉంది. సింధుదుర్గ జిల్లాలోని కుడాల్, కనకావళి, వెంగుర్లే, సావంత్వాడి, దోడామార్గ్, వైభవ్ వాడి తాలూకాలో వర్షం కురిసింది. అకాల వర్షాలతో మామిడి, కాజు పంట నష్టపోయే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు. మరాఠ్వాడాతో పాటు రాజస్థాన్లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ఇదే సూచన జారీ చేసింది. నవంబర్ 26 నుంచి 27 వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్లో వడగళ్లతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ముంబైలో భారీ వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చేస్తున్నాయి.